Trichy Airport PM Modi :ఆధ్యాత్మికత ఉట్టిపడేలాతమిళనాడు తిరుచ్చిలో అభివృద్ధి చేసిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేశారు. నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
టెర్మినల్ ప్రత్యేకతలు
తమిళనాడులో చెన్నై తర్వాత అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా తిరుచ్చి విమానాశ్రయానికి పేరుంది. ఈ నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ నిర్మించారు. రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ నూతన టెర్మినల్ ద్వారా ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ఏకంగా 3,500 మంది వరకు ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని ఈ టెర్మినల్ కలిగి ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కొత్త టెర్మినల్ భవనంలో సౌకర్యాలు ఇలా ఉన్నాయి.
- 60 చెక్-ఇన్ కౌంటర్లు
- 5 బ్యాగేజీ క్యారౌసెల్‌లు
- 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు
- 44 డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు
తిరుచిరాపల్లికి చెందిన సాంస్కృతిక చైతన్యం నుంచి ప్రేరణ పొంది కొత్త టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రసిద్ధ శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన కళారూపాలను ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ గోపురాన్ని తీర్చిదిద్దారు. వీటితో పాటు భారత్‌కు ప్రపంచంతో ఉన్న సంబంధాలను వర్ణింపజేసేలా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ వర్క్‌ను చేపట్టారు.