కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనడానికి మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. తినడానికి తిండి కూడా లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలోని ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్ శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపుతుంది. కష్టపడేతత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఆయన నిరూపించారు.
గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ ఇప్పుడు అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్‌డీ కూడా పూర్తిచేసి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరారు.
తినడానికి తిండిలేని స్థాయి నుంచి..
ఒక్కపూట తినడానికి కూడా తిండి లేని ఆరోజులు అసలు ఎలా గడిచాయో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యమేస్తుందని భాస్కర్ అన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొని బతికామంటేనే నమ్మబుద్ధి కావడంలేదని తెలిపారు. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదన్నారు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లమని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లమన్నారు. తమ ఊళ్లో 90 శాతం మందిది ఇదే పరిస్థితి అని తెలిపారు.
ఏడో తరగతి వరకు చదువుకున్న తన తండ్రికి ఓ చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ తెలిపారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్‌లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు. ఒకసారి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అసలు అక్కడికి చేరుకున్నారా లేదా కూడా తెలిసేది కాదన్నారు. మళ్లీ రెండు, మూడు నెలలకు తిరిగొచ్చేవారన్నారు. కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు.