Tree Fell on Son During Father Last Rites :తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఓ చెట్టు కొమ్మ పడటం వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఒడిశా కోరాపుట్ జిల్లా బోరిగుమ్మ బ్లాక్‌లోని కమ్ట గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. మృతుడిని వేణుధర్ మోండల్‌గా గుర్తించారు. అతడి తండ్రి లక్ష్మణ్ మోండల్ అంత్యక్రియల సమయంలో ఈ ఘటన జరిగింది.
వివరాలు ఇలా!
వేణుధర్ తండ్రి లక్ష్మణ్ అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి భౌతికకాయానికి వేణుధర్ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
అయితే, మంగళవారం ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఓ చెట్టు కొమ్మ వేణుధర్పై పడిపోయింది. యువకుడి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, యువకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.
"మంగళవారం రాత్రి నుంచి వాతావరణం బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ తీరంలో తుపాను ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. లక్ష్మణ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా చెట్టు నుంచి ఓ కొమ్మ ఊడిపోయి వేణుధర్పై పడిపోయింది. వేణుధర్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని బోరిగుమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వైద్యులు అతడు చనిపోయినట్లు చెప్పారు. ఇది మా కుటుంబానికి చాలా బాధాకర ఘటన."
-వైకుంఠ మోండల్, మృతుడి కుటుంబ సభ్యుడు