దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన వేళ.. కేంద్రం కీలక సూచనలు చేసింది. తమ దగ్గర అందుబాటులో ఉండే ఆక్సిజన్ అత్యంత అరుదైన వస్తువుగా పరిగణించాలని ఆస్పత్రులకు సూచించింది. ప్రాణవాయువు దుర్వినియోగం కాకుండా.. వినియోగ పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరినట్టు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మహమ్మారి ప్రారంభం నుంచే ఆక్సిజన్ సహకారం అందించే పడకలను ప్రధాన ఆరోగ్య కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది ఏప్రిల్-మే నెలల్లోనే ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసిందన్నారు.
"అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను అత్యంత అరుదైన వస్తువుగా పరిగణించాలి. అందుకోసం.. ప్రాణవాయువును అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను అభ్యర్థించాం. ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ద్రవ ఆక్సిజన్ ధరను నిర్ణయించేందుకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) పలు సూచనలు జారీ చేసింది."
- లవ్ అగర్వాల్, కేంద్రం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి