ఫేవరెట్ టీచర్ బదిలీ.. విద్యార్థులు, గ్రామస్థుల నిరసన.. దిగొచ్చిన అధికారులు.. సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తుంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రమే మంచి పేరు సంపాదించుకుంటారు. వారిపై ఎనలేని ప్రేమ, అభిమానాన్ని కురిపిస్తుంటారు విద్యార్థులు. అదే కోవకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ హఠాత్తుగా బదిలీ చేసింది. దీంతో స్కూల్ విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టడం వల్ల అధికారులు దిగొచ్చారు. బదిలీ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన.
జిల్లాలోని హందువినహళ్లి ప్రభుత్వ పాఠశాలలో నాగరాజు అనే ఉపాధ్యాయుడు ఏడాది క్రితం విధుల్లో చేరారు. అప్పటి నుంచి విద్యార్థులకు గణితం, సైన్స్, ఆంగ్ల సబ్జెక్టులను చక్కగా బోధిస్తున్నారు. విద్యార్థులు కూడా ఆయన తరగతులు అంటే చాలా ఇష్టపడేవారు. హఠాత్తుగా ఆయనను విద్యాశాఖ బదిలీ చేసి మరో ఉపాధ్యాయుడిని నియమించింది.
అయితే తమకు ఇష్టమైన టీచర్.. వేరే గ్రామానికి వెళ్లిపోతున్నారన్న విషయం తెలియగానే విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు కూడా చాలా బాధపడ్డారు. వెంటనే అందరూ కలిసి జిల్లా విద్యాధికారి సీఎన్రాజుకు నాగరాజు బదిలీని రద్దు చేయాలని వినతిపత్రం అందించారు. కానీ ఆ వినతిని అధికారులు తిరస్కరించారు. దీంతో విద్యార్థులు, గ్రామస్థులంతా కలిసి బదిలీ రద్దు చేయాలని ఆందోళనకు దిగారు.
ఆందోళన చేపడుతున్న గ్రామస్థులు, విద్యార్థులు దిగొచ్చిన అధికారులు..
విద్యార్థులు, గ్రామస్థులు చేపట్టిన నిరసన విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వారే దిగొచ్చారు. నాగరాజు బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. తిరిగి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించారు. దీంతో గ్రామస్థులు.. విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.