Trains Cancelled Due To Cyclone Michaung : మిగ్ జాం తుపాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్ల రద్దు ఉంటుందని తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు.
Cyclone Michaung on Telangana :ఈ నెల 4న 101 రైళ్లు, 5వ తేదీన 89 రైళ్లను, 6వ తేదీన 38 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితో పాటు 11 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. మిగ్ జాం తుపాన్ నేపథ్యంలో జీఎం అరుణ్ కుమార్ రైల్ నిలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ తదితర ఆరు డివిజన్ల డీఆర్ఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష జరిపారు. తుపాన్ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
తెలంగాణపై మిగ్జాం ఎఫెక్ట్ - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ట్రాక్, రైల్వే కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి సెక్షన్‌లోని రైల్వే ప్రభావితం చేసే ట్యాంక్‌ల స్థానాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్‌లపై మాన్‌సూన్ పెట్రోలింగ్ ఉండేలా చూడాలన్నారు. తుపాన్ ప్రభావిత రోడ్డు అండర్ బ్రిడ్జిల స్థానాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే మూసి వేయవచ్చని, నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు జీఎంకు వివరించారు. ఏమైనా పునరుద్ధరణ చర్యలు తక్కువ సమయంలో చేపట్టేందుకు ఇసుక సంచులు, బ్యాలస్ట్ నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.