tragedy in Kondamitta of Chittoor : చిత్తూరు నగరం కొండమిట్టలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్న యువతి దుర్గా ప్రశాంతి, ఆమె ప్రియుడుగా భావిస్తున్న చక్రవర్తి బ్యూటీపార్లర్లోనే రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని బంధువులు గుర్తించారు. అయితే, అప్పటికే దుర్గా ప్రశాంతి మృతి చెందింది. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఇదే సమయంలో యువకుడు చక్రవర్తి తన చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చక్రవర్తిని బంధువులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి విచారణ చేపట్టారు. చిత్తూరు నగరానికి చెందిన దుర్గా ప్రశాంతి, భద్రాచలం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన చక్రవర్తి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
బ్యూటీ పార్లర్లోనే... చక్రవర్తి కొద్దిరోజుల కిందట దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చి.. చిత్తూరు నగరానికి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొండమిట్టలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న దుర్గా ప్రశాంతి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఇరువురు మాట్లాడుతున్న సందర్భంలో దుర్గా ప్రశాంతి విషం సేవించి అపస్మారక స్థితికి చేరుకుని మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంలోనే చక్రవర్తి సైతం బ్లేడుతో తన ఎడమ చేతి మణికట్టుపై పలుమార్లు కోసుకుని.. రక్త స్రావం కారణంగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు వీరిని గుర్తించి.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే దుర్గా ప్రశాంతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న చక్రవర్తిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.