రాష్ట్రంలోకి ప్రవేశించేవారు కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సిన అవసరం లేదంటూ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర సరిహద్దులో రహదారులు కిక్కిరిసిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల మీర బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకులను అనుమతిస్తూ రాష్ట్ర సరిహద్దులను అక్కడి ప్రభుత్వం శనివారం తెరిచింది. దీంతో సరిహద్దు ప్రాంతమైన సోలాన్ జిల్లాలోని పార్వానో వద్ద వేలాది వాహనాలు క్యూ కట్టాయి. అయితే కొవిడ్ ఈ-పాస్‌ను లేనిదే రాష్ట్రంలోని అనుమతివ్వడం లేదు.
పర్యటకులకు అనుమతి..
మరోవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా పర్యాటకులకు హిమాచల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ఆంక్షలను సడలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. శనివారం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యటకులను అనుమతిస్తోంది. అయితే ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.