దేశంలో పెరిగిన ఇంధన ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు నవంబరు 1న దిల్లీలో జరిగిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.
నవంబరు 11న దిల్లీలో జాతీయ స్థాయిలో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసి.. ఆ తర్వాత క్రమంగా ప్రజలకు దగ్గరవ్వటం, రాష్ట్రస్థాయిలో సమావేశాల నిర్వహణ, మినీ పార్లమెంట్లు నిర్వహించటం.. తదితర కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి.
ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) కూడా పాల్గొంది. కార్మికుడు- కర్షకుడి భాగస్వామ్యం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతో అవసరమని ట్రేడ్ యూనియన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.