ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది గాయపడ్డారు. లఖ్‌నవూ జిల్లా అసన్హా ప్రాంతంలో సోమవారం జరిగిందీ దుర్ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు 47 మంది కలిసి ట్రాక్టర్లో గుడికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయింది. బాధితుల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు.. హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మిగిలిన వారిని స్థానికులు రక్షించారు. గాయపడ్డ వారిని మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొట్టి...
మరోవైపు, ముజఫర్‌నగర్ సమీపంలోని దిల్లీ-దెహ్రాదూన్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ కుల్దీప్ మిశ్ర(30), మనీశ్ సింఘాల్(26), అమన్ గౌతమ్(25), మరో యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ మిశ్ర మీరట్‌లో పనిచేసేవారని వివరించారు.
కుటుంబంలో విషాదం
హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు. సిర్మౌర్ జిల్లాలోని ఖిజ్వాడీ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది. మమత(27), ఆమె కూతుళ్లు ఆరంగ్(2), అమీషా(6), ఇషిత(8), మేనకోడలు అకాంశిక(7) అక్కడికక్కడే చనిపోయారని అధికారులు తెలిపారు. మమత భర్తకు గాయాలయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు.