కొత్త సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులకు వివిధ వర్గాల ప్రజల్లో మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. పలు రంగాల వారి నుంచీ అనూహ్యమైన సహకారం లభిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన యువకులు పలువురు రైతుల ఆందోళనలకు సామాజిక మాధ్యమం ద్వారా అండగా నిలుస్తున్నారు.
రైతు ఉద్యమానికి సాఫ్ట్‌వేర్ రక్షణ 'రైతులకు సామాజిక మాధ్యమం గురించి పెద్దగా తెలియదు. సోషల్ మీడియాలో వారి ఉద్యమంపై జరుగుతున్న దుష్ప్రచారం, నకిలీ వార్తల వ్యాప్తి నా దృష్టికి వచ్చింది. దీంతో రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నా' అని ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ సెలవుపై పంజాబ్ వచ్చిన భవ్‌జిత్ సింగ్ తెలిపారు. 'ట్రాక్టర్‌టుట్విటర్' అనే ట్విటర్ హ్యాండిల్‌ను రూపొందించి రైతులకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబరు 28 నుంచి ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది తమ పోస్టులను వీక్షించినట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి సంబంధించిన వార్తా చిత్రాలు, వీడియోలు, నినాదాలను హిందీ, ఇంగ్లిషు, పంజాబీలలో పోస్టు చేస్తున్నట్లు వెల్లడించారు.
రైతు ఉద్యమానికి సాఫ్ట్‌వేర్ రక్షణ ఈ కృషిలో భవ్‌జిత్‌సింగ్ మిత్రుడు జస్‌ప్రీత్ సింగ్ కూడా భాగస్వామి అయ్యాడు. 'ఎలా ట్వీట్ చేయాలో రైతులకు తెలియదు. వారికి ఐటీ విభాగం ఏమీలేదు. అందువల్ల వారి ఉద్యమాన్ని ట్విటర్‌తో అనుసంధానం చేయాలనుకున్నాం. సామాజిక మాధ్యమంలో రైతుల ఆందోళనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవటానికే ట్రాక్టర్‌టుట్విటర్ ప్రారంభించాం. చాలా మంది యువకులు స్వచ్ఛందంగా దీని నిర్వహణకు ముందుకు వచ్చారు' అని జస్‌ప్రీత్ వెల్లడించారు. దుష్ప్రచారం చేసే వారికి సోషల్ మీడియా ద్వారానే గట్టిగా సమాధానం ఇవ్వగలుగుతున్నట్లు తెలిపారు.
తరలివచ్చిన ఉన్ని దుస్తుల దుకాణాలు
గజగజ వణికిస్తున్న చలిలోనూ రోజుల తరబడి ఆందోళనను కొనసాగిస్తున్న రైతులకు వెచ్చని ఉన్ని దుస్తులు అందించేందుకు దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోని శిబిరాల వద్ద పలు దుకాణాలు వెలిశాయి. రైతులకు మద్దతుగా తక్కువ ధరకే వాటిని విక్రయిస్తున్నట్లు పలువురు వ్యాపారులు తెలిపారు. తాము కూడా చిన్న రైతులమేనని, ఉపాధి కోసమే చిరువ్యాపారాలు చేస్తున్నామని వెల్లడించారు. ధర్నా శిబిరాల్లోని మహిళలు, పురుషులు, చిన్నారులు...ఇంకా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండేందుకు అవసరం కావచ్చనే అంచనాతో ఆయా దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.