పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి ఆపరేషన్ చేశాడో వైద్యుడు. బిడ్డను బయటకు తీసి కడుపులో టవల్ వదిలేశాడు. విషయం తెలియని ఆ మహిళ కడుపునొప్పితో బాధపడింది. భరించలేక మరో ఆసుపత్రికెళితే అక్కడ ఈ వైద్యుడి నిర్వాకం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
ఇదీ జరిగింది
అమ్రోహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానిక సైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుడు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టవల్‌ను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లేశారు. ఆపరేషన్ తర్వాత నజ్రానా కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పింది. కానీ, ఆ డాక్టర్.. బయట చలి ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగిందని చెప్పి మరో ఐదు రోజులు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచాడు.