శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను మూసివేశారు. గత రెండురోజులుగా అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. ఆలయ పరిసరాలు పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయాయి. ఫలితంగా సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ ద్వారాలను మూసివేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆలయ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదివారమే ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం సహా ఆలయ పునర్‌నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు.. మంచులో సందడి చేశారు. స్వీయ చిత్రాలు దిగుతూ, మంచులో ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడిపారు.