తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో ఎస్పీ, భాజపా హోరాహోరీ.. 4, 5వ విడతల్లో ఇవే కీలకం! - ఎస్పీ న్యూస్

UP Assembly Elections: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. తొలి మూడు దశల్లో జాట్‌లు, ముస్లింలు, యాదవులు ప్రాబల్యం చూపగా.. తదుపరి దశల్లో స్థానిక అంశాలు కీలకంగా మారనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Tough fight between SP and BJP
ఎస్పీ, భాజపా హోరాహోరీ

By

Published : Feb 22, 2022, 7:05 AM IST

UP Assembly Polls: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని విపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆదివారంతో మూడో దశ పోలింగ్‌ ముగిసింది. తొలి విడతలో జాట్‌లు, రెండో దశలో ముస్లింలు, మూడో విడతలో యాదవుల ప్రాబల్యం గురించి ఎక్కువగా చర్చ నడిచింది. ఇక 4, 5 దశల్లో ఐదు అంశాలు కీలకంగా మారనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అవి- రేషన్‌, వట్టిపోయిన గోవులు, సంక్షేమ పథకాలు, సామాజిక గౌరవం, ముస్లిం ఓట్లు. ప్రధానంగా అవధ్‌, మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లోని సీతాపుర్‌, లఖ్‌నవూ, చిత్రకూట్‌ సహా 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న 70 అసెంబ్లీ స్థానాల్లో (తదుపరి రెండు దశల్లో వీటికి పోలింగ్‌ జరగనుంది) ఈ అంశాల చుట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వీటిలో కొన్ని భాజపాకు కలిసొచ్చేవి కాగా.. మరికొన్ని- ఎస్పీ (సైకిల్‌ గుర్తు)కి అనుకూలాంశాలు. దీంతో తర్వాతి రెండు దశల్లోనూ వాటి మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోరు కొనసాగే అవకాశాలున్నాయి.

ఉచిత రేషన్‌పై హర్షం

కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పుడు జనజీవనం ఎంతగా అస్తవ్యస్తమైందో ప్రతిఒక్కరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందించిన రేషన్‌.. పేదలకు వరంగా మారింది. యూపీలో పేదలకు రెండేళ్లుగా ఉచిత రేషన్‌ అందుతోంది. 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. దీనికి తోడు కొవిడ్‌ టీకా ఉచితంగా లభించడంపైనా స్థానిక పేదలు సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం కారణంగా భాజపాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కంటే.. ఉచిత రేషన్‌, టీకాల పంపిణీతో ఏర్పడిన సానుకూల ధోరణే ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంక్షేమ పథకాలపై సానుకూలత

సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పలు సంక్షేమ పథకాల్లో భాగంగా ఇళ్లు, సిలిండర్ల వంటివి తమ పేర్ల మీదే మంజూరవుతుండటంపై మహిళలు సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో తమ గౌరవం పెరుగుదలకు అవి కారణమవుతున్నాయని చెబుతున్నారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని చిత్రకూట్‌, బాందా జిల్లాల్లో పక్కా ఇల్లు, కొళాయి కనెక్షన్‌ పొందినవారు భాజపాపై అత్యంత సానుకూల ధోరణితో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

గోవుల సంచారంపై ఆగ్రహం

గోవధపై యోగి సర్కారు నిషేధం విధించడంతో.. వట్టిపోయిన ఆవులను ప్రజలు రోడ్లపై వదిలేసి చేతులు దులుపుకొంటున్నారు! అవి పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు రేయింబవళ్లు పొలాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. పంటచేన్ల చుట్టూ కంచెలు ఏర్పాటుచేసుకోక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇది కమలదళానికి ప్రతికూలాంశం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మరింత ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటుచేసి, ఈ సమస్యను పరిష్కరిస్తామని భాజపా నేతలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే లాడ్స్‌ కింద తమకు వచ్చే నిధులను పూర్తిగా గోశాలల నిర్వహణకే కేటాయిస్తామని ఆ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు.

ఠాకుర్ల ఆధిపత్యంపై గుర్రు

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఠాకుర్ల హవా నడిచిందని.. తమకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదని యాదవులతో పాటు పలువురు యాదవేతర ఓబీసీలు ఆరోపిస్తున్నారు. యోగి గద్దె దిగితే గానీ తాము సమాజంలో సముచిత గౌరవాన్ని తిరిగి పొందలేమని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ ఓటమి కోసం వారంతా సంఘటితంగా కృషిచేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎస్పీకి మద్దతుగా ముస్లింల సంఘటితం

ఈ దఫా ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎస్పీకి సంపూర్ణ స్థాయిలో అండగా నిలవబోతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీల మధ్య ఈ వర్గం ఓట్లు చీలిపోయేవి. ఫలితంగా భాజపాకు లబ్ధి చేకూరేది. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీఎస్పీలు భాజపాను ఓడించే స్థితిలో లేవని స్థానిక ముస్లింలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాటికి ఓటు వేసే బదులు.. ఎస్పీ వైపు మొగ్గితే భాజపాను గద్దె దించొచ్చని వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​కు 'ఈవీఎం' ట్యాంపరింగ్​ భయం.. కార్యకర్తలతో కాపలా!

ABOUT THE AUTHOR

...view details