Total Woman Candidates in Telangana Elections :శాసనసభ ఎన్నికల కోసం సిద్దం చేసిన ఓటరు జాబితా(Voters List in Telangana)లో రాష్ట్రంలో 3కోట్ల 17 లక్షల 17వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో పురుషులు 1,58,71,493 మందికాగా.. మహిళలు 1,58,43,339 మంది అంటే.. దాదాపు సగం మంది ఓటర్లు మహిళ(Woman Voters)లే. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో కీలకపాత్ర అతివలదే. కొన్ని నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. 50శాతం రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల్లో సగానికిపైగా ప్రజాప్రతినిధులు మహిళలకు అవకాశం దక్కుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election 2023)కు వచ్చే సరికి మాత్రం మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం దక్కడం లేదు. రాజకీయ పార్టీలు.. వారికి పోటీ చేసేందుకు ఇస్తున్న సీట్లు, అందులో వారు గెలిచే స్థానాలు.. పురుషులతో పోల్చితే చాలా తక్కువ.
1998-2003 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 21,161 మంది ఎమ్మెల్యేలు(Woman MLA Candidates)గా ఎన్నిక కాగా వారిలో మహిళల సంఖ్య ఒక 1,584 మాత్రమే. ఏపీ, తెలంగాణ సహా దేశంలో 19 రాష్ట్రాల్లో మహిళా శాసనసభ్యులు 10శాతానికి మించి లేరు. పార్లమెంటులోనూ వారి ప్రాతినిధ్యం 15శాతం కంటే తక్కువకే పరిమితమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో బరిలో నిలిచిన మహిళల సంఖ్య 140 మాత్రమే. సుమారు 81 నియోజకవర్గాల్లో మహిళలు పోటీలో నిలిచారు. కాని అందులో గెలిచిన మహిళా అభ్యర్థులు కేవలం ఆరుగురే. 122 మందికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 12మంది డిపాజిట్లు దక్కించుకున్నా ఓటమి పాలయ్యారు. డీకే అరుణ, కొండా సురేఖ వంటి ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారు.
Telangana Election 2018 :గత ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్(BRS) అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్, మెదక్ నుంచి గులాబీ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. 119 నియోజకవర్గాల్లో ఎన్నికైన మహిళా శాసనసభ్యుల సంఖ్య కేవలం 5శాతం మాత్రమే. వీరిలో పద్మాదేవేందర్‌రెడ్డి మొత్తం ఓట్లలో 58శాతానికిపైగా ఓట్లు సాధించి ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు. సీతక్క 53శాతం, గొంగిడి సునీతా 49.93శాతం, అజ్మీరా రేఖ 44.94శాతం, హరిప్రియ 43.46శాతం, సబితా ఇంద్రారెడ్డి 41.14శాతం ఓట్లు కొల్లగొట్టి విజయతీరాలకు చేరారు.