మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుంబ్డే ఒకరని ధ్రువపడింది. శనివారం నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయినవారి సాయంతో మృతుల్లో 16 మందిని గుర్తించారు. మృతదేహాలను ఆదివారం తెల్లవారుజామున గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. తేల్‌తుంబ్డేపై రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని తమ శాఖ ప్రకటించిందని పోలీసు అధికారులు తెలిపారు. అతడి కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలు గత కొన్నేళ్లుగా గాలిస్తున్నాయి. అతడికి అంగరక్షకులుగా ఉన్న ఒక స్త్రీ, మరో పురుషుడు కూడా తాజా కాల్పుల్లో చనిపోయారు. ఉద్యమకారుడు ఆనంద్ తేల్‌తుంబ్డేకు మిలింద్ సోదరుడు. మావోయిస్టుల కమాండర్‌గా ఉన్న లోకేశ్ అలియాస్ మంగు పొండ్యం (రూ.20 లక్షల రివార్డు), కస్నాసుర్ దళం డివిజనల్ కమిటీ సభ్యుడు మహేశ్ అలియాస్ శివాజీరావోజీ గోతా (రూ.16 లక్షల రివార్డు) సహా 26 మందిపై కలిపి రూ.1.39 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
కమాండోలపై గుళ్ల వర్షం
గాలింపు చర్యల్లో పాల్గొన్న సి-60 కమాండోలు, జవాన్లపై దాదాపు 100 మంది వరకు మావోయిస్టులు అధునాతన ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించారనీ, లొంగిపోవాల్సిందిగా చేసిన హెచ్చరికల్ని బేఖాతరు చేశారనీ గడ్చిరోలి రేంజి డీఐజీ సందీప్ పాటిల్ విలేకరులకు తెలిపారు. ఉద్యమాన్ని విస్తరించడంలో తేల్‌తుంబ్డేది కీలక పాత్ర అనీ, అతడి మరణంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పారు. ఘటనా స్థలంలో ఐదు ఏకే-47 తుపాకులు సహా 29 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. మృతిచెందిన వారిలో తెలుగు రాష్ట్రాల మావోయిస్టులెవరూ లేరని ప్రకటించారు. 'ఎల్‌పీజీఏ వారోత్సవాల సందర్భంగా భారీ విధ్వంసం సృష్టించేందుకు గ్యార్‌పట్టి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారు. సమాచారం తెలిసిన బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఉదయం 9.30కి పోలీసులపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు' అని వివరించారు.
సింగరేణి కార్మికుడి నుంచి మావోయిస్టు సీసీఎంగా..