Opposition Parties Meeting In Bangalore : విపక్ష కూటమి బెంగళూరు సమావేశానికి దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 26 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ పార్టీలు.. మొత్తం 11 రాష్ట్రాల్లో ఒంటరిగా లేదా కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నాయి. ఆ 26 పార్టీలు ఏంటి, పార్లమెంటులో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే వివరాలు మీకోసం..
1. కాంగ్రెస్
- విపక్ష కూటమిలో అతిపెద్ద పార్టీ ఇదే.
- మొత్తం 80 మంది ఎంపీలు(లోక్‌సభలో 49, రాజ్యసభలో 31) ఉన్నారు.
- నాలుగు రాష్ట్రాల్లో(కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్)లో అధికారంలో ఉంది. బిహార్, తమిళనాడు, ఝార్ఖండ్‌లో అధికార కూటమిలో భాగస్వామి.
2. తృణమూల్ కాంగ్రెస్-టీఎంసీ
- బంగాల్లో అధికారంలో ఉంది.
- మొత్తం ఎంపీల సంఖ్య 35(లోక్‌సభలో 23, రాజ్యసభలో 12).
- మేఘాలయ సహా మరికొన్ని రాష్ట్రాల్లో శాసనసభ్యులు ఉన్నారు.
3. ద్రవిడ మున్నేట్ర కళగం-డీఎంకే
- తమిళనాడులో అధికార పార్టీ. పుదుచ్చేరిలోనూ ప్రాబల్యం.
- పార్లమెంటులో బలం 34(లోక్‌సభలో 24, రాజ్యసభలో 10 మంది ఎంపీలు).
4. ఆమ్ఆద్మీ పార్టీ
- దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది.
- 11 మంది ఎంపీలు(లోక్‌సభలో ఒకరు, రాజ్యసభలో 10 మంది).
- జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో ఆప్‌కు విభేదాలు.
5. జనతాదళ్ యునైటెడ్-జేడీయూ
- బిహార్‌లో అధికార కూటమిలో భాగస్వామి.
- పార్టీ అధినేత నీతీశ్ కుమార్.. బిహార్ సీఎం. విపక్ష కూటమి తొలి సమావేశాన్ని పట్నాలో ఆయనే నిర్వహించారు.
- పార్లమెంటులో సభ్యుల సంఖ్య 21(లోక్‌సభలో 16, రాజ్యసభలో 5).
- గతేడాది బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీ-కాంగ్రెస్‌తో కలిసి అధికారం చేపట్టిన నీతీశ్ కుమార్.
6. రాష్ట్రీయ జనతా దళ్-ఆర్జేడీ
- బిహార్‌లో జేడీయూ, కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉంది.
- ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్.. బిహార్ ఉపముఖ్యమంత్రి.
- మొత్తం ఆరుగురు ఎంపీలు ఉన్నారు. అందరూ రాజ్యసభ సభ్యులే.
7. ఝార్ఖండ్ ముక్తి మోర్చా-జేఎంఎం
- అధికార కూటమిలో భాగస్వామి.
- జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్.. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి.
- ముగ్గురు ఎంపీలు(లోక్‌సభలో ఒకరు, రాజ్యసభలో ఇద్దరు) ఉన్నారు.
8. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-ఎన్సీపీ
- విపక్ష కూటమి రెండో సమావేశానికి ముందే ఎన్సీపీ నిట్టనిలువునా చీలిపోయింది.
- అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరారు.
- శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం.. కాంగ్రెస్, శివసేన(యూబీటీ)తో కలిసి ప్రతిపక్షంగా ఉంది.
9. శివసేన(యూబీటీ)
- 2022 జూన్‌లో శివసేన రెండుగా చీలిపోయింది.
- ఏక్నాథ్ శిందే నేతృత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపారు.
- శిందే తిరుగుబాటుతో అధికారం కోల్పోయి, శివసేన(యూబీటీ)గా మారింది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ.
- ప్రస్తుతం మహారాష్ట్రలో విపక్ష పాత్ర పోషిస్తోంది.
10. సమాజ్‌వాదీ పార్టీ-ఎస్పీ
- మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. ప్రస్తుతం యూపీలో ప్రధాన ప్రతిపక్షం.
- లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
11. రాష్ట్రీయ లోక్ దళ్-ఆర్ఎల్డీ
- పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రాబల్యం ఉంది.
- మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనమడు, పార్టీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ కుమారుడైన జయంత్ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్డీకి నేతృత్వం వహిస్తున్నారు.
- ఆ పార్టీ నుంచి జయంత్ చౌదరికి మాత్రమే పార్లమెంటు(రాజ్యసభ) సభ్యత్వం ఉంది.
12. అప్నా దళ్(కమెర్వాడీ)
- ఉత్తర్‌ప్రదేశ్ పార్టీ. సోనేలాల్ స్థాపించిన అప్నా దళ్ చీలిక వర్గం ఇది.
- సోనేలాల్ భార్య కృష్ణ పటేల్, కుమార్తె పల్లవి పటేల్ నేతృత్వం వహిస్తున్నారు.
- యూపీలో ఎస్పీతో అప్నా దళ్(కమెర్వాడీ) పొత్తులో కొనసాగుతోంది.
- ప్రత్యర్థి వర్గమైన అప్నా దళ్(సోనేలాల్) ఎన్డీఏలో భాగస్వామి. ఆ పార్టీ అధినేత్రి అనుప్రియా పటేల్.. కేంద్ర మంత్రి.
13. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్సీ
- జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటి.
- మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్నారు.
- లోక్‌సభలో ముగ్గురు సభ్యుల బలం ఉంది.
14. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పీడీపీ
- జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటి.
- మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నాయకత్వం వహిస్తున్నారు.
- ప్రస్తుతం లోక్‌సభలో పీడీపీ సభ్యులు ఎవరూ లేరు.
15. భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్)-సీపీఎం
- వామపక్షాల్లో సీపీఎం ప్రధాన పార్టీ.
- కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమికి నేతృత్వం వహిస్తోంది.
- బంగాల్, త్రిపుర, తమిళనాడులోనూ ప్రాబల్యం ఉంది.
- పార్లమెంటులో 8 మంది(లోక్‌సభ ముగ్గురు, రాజ్యసభలో ఐదుగురు) ఎంపీలు ఉన్నారు.
16. భారత కమ్యూనిస్ట్ పార్టీ-సీపీఐ
- కేరళలోని ఎల్డీఎఫ్ కూటమిలో భాగస్వామి.
- లోక్‌సభలో ఇద్దరు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు.
17. భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
- బిహార్‌లోని అధికార కూటమిలో సీపీఐ-ఎంఎల్ భాగస్వామి.
- బిహార్‌లో 12 మంది శాసనసభ్యులు ఉన్నారు.
- దీపాంకర్ భట్టాచార్య నేతృత్వం వహిస్తున్నారు.
18. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ-ఆర్ఎస్పీ
- వామపక్ష కూటమిలో భాగస్వామి.
- కేరళ నుంచి ఒకరు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు.
- బంగాల్, త్రిపుర సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఆదరణ ఉంది.
19. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ.
- వామపక్ష కూటమిలో భాగస్వామి.
- పార్లమెంటు, అసెంబ్లీల్లో ఎలాంటి బలం లేదు.
- వామపక్షాల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కాస్త ఆదరణ ఉంది.
20. మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం-ఎండీఎంకే
- తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామి.
- తమిళనాడు, పుదుచ్చేరిలో ఆదరణ ఉంది.
- రాజ్యసభ సభ్యుడు వైకో.. ఎండీఎంకేకు నేతృత్వం వహిస్తున్నారు.
21. విడుదలై చిరుతైగల్ కచ్చి-వీసీకే
- తమిళనాడులోని డీఎంకే కూటమిలో భాగస్వామి.
- అధినేత తిరుమావలవన్.. లోక్‌సభలో సభ్యునిగా ఉన్నారు.
22. కొంగునాడు మక్కల్ దేశై కచ్చి-కేఎండీకే
- తమిళనాడులోని అధికార కూటమిలో భాగస్వామి.
- పశ్చిత తమిళనాడులో కాస్త ప్రాబల్యం ఉంది.
- రాజకీయ నేతగా మారిన వ్యాపారవేత్త ఈఆర్ ఈశ్వరన్.. నేతృత్వం వహిస్తున్నారు.
- కేఎండీకే నేత ఏకీపీ చినరాజ్.. లోక్‌సభ సభ్యుడు. కానీ.. ఆయన డీఎంకే గుర్తుపై గెలిచారు.
23. మణిథనేయ మక్కల్ కచ్చి-ఎంఎంకే
- తమిళనాడులోని డీఎంకే కూటమిలో భాగస్వామి.
- ఎంఎంకే అధినేత జవహిరుల్లా ప్రస్తుతం ఎమ్మెల్యే.
- ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యునిగా ఉన్నారు జవహిరుల్లా.
24. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్
- కేరళ కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీ.
- ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు ఐయూఎంఎల్ మిత్రపక్షం.
- లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒకరు సభ్యులుగా ఉన్నారు.
25. కేరళ కాంగ్రెస్(ఎం)
- కేరళ కేంద్రంగా పని చేసే పార్టీ.
- లోక్‌సభలో ఒకరు, రాజ్యసభలో ఒకరు సభ్యులుగా ఉన్నారు.
- ఎల్డీఎఫ్ కూటమిలో భాగంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.
26. కేరళ కాంగ్రెస్(జోసెఫ్)
- కేరళ కేంద్రంగా పని చేసే పార్టీ.
- 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో భాగంగా పోటీ చేసింది.
కాంగ్రెస్‌కు అధికారంపైన ఆసక్తి లేదు : ఖర్గే
Bangalore Meeting Opposition : కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 'మనం ఇక్కడ సమావేశమైన ఉద్దేశం అధికారం దక్కించుకోవడం కాదు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం. రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే అవి సిద్ధాంత పరమైనవి కాదు. ద్రవ్యోల్బణం కారణంగా అష్టకష్టాలు పడుతున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగంతో బాధపడుతున్న మన యువత, పేదల కోసం.. పక్కన పెట్టలేనంత పెద్దవి కాదు.
దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కులను తెరవెనుక నిశ్శబ్దంగా నలిపేస్తున్నారు. ప్రస్తుతం 26 పార్టీలు కలిసి 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదు. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుని.. ఆ తర్వాత వాటిని పక్కనపెట్టింది. ప్రస్తుతం.. తెగదెంపులు చేసుకున్న పార్టీలతో మళ్లీ జతకట్టడానికి బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు' అని ఖర్గే అన్నారు.