గణతంత్ర దినోత్సవం నాటి కిసాన్ పరేడ్లో ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు భద్రతా బలగాల వైఫల్యమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్రిక్తతల గురించి 20 రోజుల ముందే అధికారులు పసిగట్టినట్లు తెలుస్తోంది.
సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వంటి నిషేధిత వేర్పాటువాద సంస్థలు.. ఎర్రకోటపై ఖలిస్థానీ జెండాలు ఎగురవేయనున్నాయని అధికారులు తెలుసుకున్నారు. ఈ మేరకు జనవరి మొదటి వారంలో.. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) స్పెషల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇతర ముఖ్య నిఘా విభాగాల అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్లీకి చెందిన 8 మంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులు.. 12 మంది ఐబీ అధికారులు సహా రా, ఎస్పీజీ, హరియాణా పోలీసులు పాల్గొన్నారు. ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తతలు జరిగే అంశంపై అధికారులు చర్చించారు. ఈ క్రమంలోనే.. జనవరి 20 నుంచి 27 వరకు ఎర్రకోటను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
జెండా ఎగురవేస్తే రివార్డులు ఇస్తామని..
పంజాబ్లోని సిక్కుల కోసం ప్రత్యేక దేశం 'ఖలిస్థాన్' కావాలని డిమాండ్ చేసే ఓ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే). 2007లో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థానీ జెండా ఎగురవేసినవారికి, ఫిబ్రవరి 1న పార్లమెంటుపై జాతీయ పతాకాన్ని తొలగించిన వారికి భారీగా నగదు బహుమతి అందిస్తామని ఎస్ఎఫ్జే అంతకుముందే ప్రకటించడం గమనార్హం.
రిపబ్లిక్ డే.. వారికి బ్లాక్ డే