ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో పాగా వేసిన కమలదళం.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్, భాజపా మధ్య ద్విముఖ పోరు ఉండగా.. తాజాగా ఆప్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. మరి ఈసారి గెలుపెవరిది? ఏ అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయో పరిశీలిస్తే...
1. నరేంద్ర మోదీ:
ప్రధాని పదవి చేపట్టే ముందు గుజరాత్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మోదీ. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపా ప్రధాన బలం మోదీ చరిష్మానే. గుజరాత్ విషయంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే పనిచేస్తుంది. గుజరాత్లో ఆయన కుర్చీని వదిలి ఎనిమిదేళ్లు అవుతున్నా.. సొంత రాష్ట్రంలో పట్టు మాత్రం కోల్పోలేదు. ప్రధాన అనుచరులంతా ఇప్పటికీ ఆయనవెంటే ఉన్నారు. రాబోయే ఈ ఎన్నికలలో మోదీ ప్రభావం అతిపెద్ద నిర్ణయాత్మక శక్తిగా ఉండనుంది అనడంలో సందేహం లేదు.
2. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదల:
బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం మెజారిటీ, మైనారిటీ వర్గాలలో భిన్నమైన ప్రభావం చూపించాయి. ఈ అంశం సైతం అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానుంది.
3. ప్రభుత్వ వ్యతిరేకత:
1998 నుంచి 24 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోంది భాజపా. ఇంత సుదీర్ఘ పాలనలో ప్రభుత్వంపై సాధారణంగానే వ్యతిరేకత ఏర్పడుతుంది. కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇనేళ్ల భాజపా పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు అలాగే ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు హరి దేశాయ్ చెబుతున్నారు.
4. మోర్బీ వంతెన ఘటన:
గత నెల 30న మోర్బీలో వంతెన కూలిపోవడం వల్ల 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అధికార యంత్రాంగంలోని లోపాలను ఎత్తిచూపింది. ఈ అంశం సైతం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
5. పేపర్ లీక్‌లు:
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో తరచూ పేపర్లు లీక్ కావడం, దాంతో నియామక పరీక్షలను వాయిదా వేయడం నిరుద్యోగుల్లో ఆగ్రహానికి దారితీసింది. దీనిపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది యువత ఓట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు.