అన్నదాతల ఆందోళనకు సంబంధించిన టూల్‌కిట్ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి ఊరట లభించింది. దిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో, రూ. లక్షకు సమానమైన బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు.. దిశా రవికి ఖలిస్థానీ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలకు, దిశకు సంబంధాలున్నట్లు తేలలేదని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 26న జరిగిన హింసకు పాల్పడిన వారితో ఖలిస్థానీ పీజేఎఫ్ లేదా దిశకు సంబంధాలున్నట్లు ఒక్క సాక్ష్యాధారమూ లేదని పేర్కొంది. ఆమెకు బెయిల్ వద్దని చెప్పేందుకు ఏ కారణమూ లేదని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తెలిపారు.
మరోవైపు, దిశకు బెయిల్ మంజూరు చేయడాన్ని దిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఆమె బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.
రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఈ టూల్‌కిట్ డాక్యుమెంట్ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.