Tomato Vehicle Robbery : 2.5 టన్నుల టమాటాల వాహనాన్ని హైజాక్ చేశారు ముగ్గురు దుండగులు. టమాటాలను మార్కెట్‌కు తరలిస్తుండగా.. మధ్యలో వాహనాన్ని లాక్కుని తీసుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ ఘటన రెండు రోజుల కింద జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్కు చెందిన ఓ రైతు కోలార్ మార్కెట్‌కు 2.5 టన్నుల టమాటాలను బొలేరోలో తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తుండగా.. పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టింది బొలేరో. దీంతో కారులో ఉన్న ముగ్గురు దుండగులు.. ఆ వాహన డ్రైవర్, రైతుతో గొడవపడి దాడి చేశారు. అనంతరం వారి నుంచి నష్టపరిహారం కూడా డిమాండ్ చేశారు. తమ వద్ద నగదు లేదని వారు చెప్పడం వల్ల.. ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో ఆగ్రహించిన నిందితులు.. రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి టమాటాల వాహనంతో పారిపోయారు. టమాటాల ఖరీదు సుమారు రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కోసి సిద్ధంగా ఉంచిన టమాటాల చోరీ
అంతకుముందు కూడా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షలు విలువైన టమాటా పంట చోరీకి గురైంది. 50 నుంచి 60 బస్తాల టమాటాలతో దొంగలు పరారయ్యారు. టమాటాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల.. పంట కోసి మార్కెట్‌కు తరలిద్దామనుకున్న క్రమంలో చోరీ జరిగిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై.. హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.