Tomato Theft In Jharkhand : దేశంలో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొందరు టమోటాలు కొనడం మానేశారు. మరికొందరు చాలా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరగడం వల్ల.. ఇప్పుడు బంగారం, వెండిలాగే టమాటాలు.. దొంగల టార్గెట్‌లో చేరాయి. ఈ కారణంగానే డబ్బులు, ఆభరణాల మాదిరిగానే ఇప్పుడు టమాటలను కూడా దొంగలు దోచేస్తున్నారు. ఇలాంటి ఘటనే.. ఝార్ఖండ్‌లోని గుమ్లా పట్టణంలో ఉన్న తంగ్రా కూరగాయల మార్కెట్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. కొందరు దుండగులు కూరగాయల విక్రయదారుల దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. 12మంది వ్యాపారుల దుకాణాల వద్ద నుంచి రూ. 10 వేల నగదు, సుమారు 40 కిలోల టమాటాలతో పాటు తదితర వస్తువులను అపహరించారు.
శనివారం ఉదయం కూరగాయల విక్రయదారులు తమ దుకాణాలను తెరిచి చూడగా టమాటా బాక్సులు పగలగొట్టి కనిపించాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై గుమ్లా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పగలి ఉన్న బాక్సులను పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ద్వారా దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు. టమాటాలు చోరీ అవడం వల్ల దుకాణదారులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.