Tomato Stolen In Karnataka : కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షలు విలువైన టమాటా పంట చోరీకి గురైంది. 50 నుంచి 60 బస్తాల టమాటాలతో దొంగలు పరారయ్యారు. టమాటాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల.. పంట కోసి బెంగళూరుకు తరలిద్దామనుకున్న క్రమంలో చోరీ జరిగిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జరిగింది ఈ ఘటనపై.. హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆశలు ఆవిరి..
ధరణి అనే మహిళ కర్ణాటకలోని హసన్ జిల్లా సోమనహళ్లి గ్రామానికి చెందిన వారు. ఆమె టమాటా రైతు. ఈ సంవత్సరం ధరణి.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండకరాలలో టమాటా పంట సాగు చేశారు. ఈసారి పంట దిగుబడి బాగా వచ్చిందని, మార్కెట్లో కూడా టమాటాలకు డిమాండ్ ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయని వారు ఆశించారు. బెంగళూరు మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 120 పలుకుతున్న క్రమంలో.. పంట కోసి మార్కెట్కు పంపుదామని అనుకునేలోపు ఇలా జరిగింది. దీంతో మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
" మాకు గతంలో చిక్కుడు పంటలో నష్టం వచ్చింది. దీంతో అప్పులు చేసి మరీ టమాటా సాగు చేశాము. ఈసారి పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. దానికి తోడు మార్కెట్లో టమాటా మంచి ధర పలుకుతోంది. ఇలాంటి సమయంలో దొంగలు పంటను దోచుకున్నారు. సుమారు 50 - 60 బస్తాల టమామాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారు"