టమాటాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అనేక మంది నేతలు వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ వారాణాసికి చెందిన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడు.. ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకుని టమాటాలను అమ్మి వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసింది ప్రభుత్వం.
ఇదీ జరిగింది
Tomato Seller With Bouncer : టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టి విక్రయించాడు ఓ వ్యక్తి. కనీసం ఎవరినీ ముట్టుకోనియకుండా అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని గమనించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా ఇదంతా నిరసనలో భాగమని తేలింది. టమాటాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినూత్న నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు సమాజ్‌వాదీ పార్టీ నాయుకుడు అజయ్. ఇందుకోసం లంక పోలీస్ స్టేషన్ పరిధిలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న రాజ్‌నారాయణ్, అతడి కుమారుడు వికాస్‌ను సంప్రదించాడు. వారి కూరగాయల దుకాణంలో కూర్చుని టమాటాల వద్ద ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని నిరసన చేపట్టాడు. ఇది ప్రభుత్వానికి తెలియడం వల్ల తాజాగా ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాజ్‌నారాయణ్, అతడి కుమారుడు వికాస్‌ను అదుపులోకి తీసుకోగా.. ఎస్పీ నాయకుడు అజయ్ యాదవ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని డీసీపీ ఆర్ఎస్ గౌతమ్ తెలిపారు.
మండిపడ్డ అఖిలేశ్ యాదవ్
దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన కూరగాయల వ్యాపారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యకరమైన వ్యంగ్యానికి ఈ దేశంలో చోటు లేదని.. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణమన్నారు.