Tomato Price Today Telangana :తెలుగు రాష్ట్రాల్లోటమాట ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయల్లో ప్రధానమైన టమాటధరఅమాంతం పెరిగిపోవడంతో సామాన్యులపై తీవ్రప్రభావం చూపుతోంది. యాసంగి ముగిసిన తర్వాత కొత్తగా వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అధికఉష్ణోగ్రతలు, వర్షాలప్రభావం, తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో పెట్టుబడులు పెరిగి.. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లో రేట్లు పెరిగాయి. సికింద్రాబాద్ బోయినపల్లి టోకు మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.72 పలికింది. హైదరాబాద్ జంట నగరాల్లో రైతుబజార్లలో బోర్డు రేటు రూ.75గా నిర్ణయించారు. రైతుబజారులో వ్యాపారులు, రైతులు కిలో టమాట ధర రూ.90 నుంచి రూ.100 చొప్పున విక్రయించడంతో కిలో కొనాలనుకున్నా.. ధరను చూసి అరకిలో, పావుకిలోకే పరిమితం అవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
"వర్షాలు రాకముందే రేట్లు అయితే పెరిగిపోయాయి. ఇక్కడ కిలో టమాట ధర 75 రుపాయలు. బయట మార్కెట్‌లో 100 రుపాయలుగా ఉంది. కొనలేక పోతున్నాం, కిలో కొనే దగ్గర పావు కిలో కొంటున్నాం." - కొనుగోలుదారుడు
Tomato Price Today AP : గత నెలలో టమాటా ధర కిలో 3 నుంచి 5 రూపాయలు పలకగా మదనపల్లి, కర్నూలు టోకుమార్కెట్ యార్డుల్లో గిట్టుబాటు ధరలు లేక అనేకమంది పంట పడేశారు. ఆ సమయంలో... హైదరాబాద్‌లో కిలో టమాట రూ.20 విక్రయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. టమాటనే కాదు...పచ్చిమిరపకాయ, సోయాచిక్కుడు, గింజచిక్కుడువంటి కూరగాయలు కిలో 100కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. టమాట, బీన్స్, చిక్కుడుకాయల ధరలు పెరిగితే వాటికి బదులుగా ఇతర కూరగాయలు వినియోగిస్తే ఆర్థిక భారం పడదని పలువురు సూచిస్తున్నారు.
"టమాట ధర నెల కిందట 25 రూపాయలు ఉంది. ఎండల వల్ల పూత రాలేదు. పూత రాలేదు కాబట్టే రైతుకు దిగుమతి లేదు. వంద బాక్సులు వచ్చేది 10 బాక్సులు మాత్రమే వస్తుంది. పది బాక్సులకు ఒక్కో బాక్సు 200 రుపాయలకు పోతుంది. రూ.75 కిలో అమ్ముతున్నారు. ఎలాంటి దళారీ లేదు మోసం లేదు. ఇంకా రెండు నెలలు పరిస్థితి ఇలానే ఉంటుంది." - నరసింహా రెడ్డి, రైతు