Tomato Farmer Murder in Madanapalle: టమాట అమ్మిన డబ్బులు ఉంటాయన్న అనుమానంతో ఓ రైతును అటకాయించిన దుండగులు.. దారుణంగా హతమార్చారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. గ్రామీణ సీఐ సత్యనారాయణ అందించిన సమాచారం మేరకు.. జిల్లాలోని మదనపల్లె మండలం బోడిపల్ల దిన్నె గ్రామానికి చెందిన టమాట రైతు నారెం రాజశేఖర్ రెడ్డి (62) ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలంలోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పాలు పోయడానికి ఊళ్లోకి వెళ్లి వస్తుండగా మధ్యలో అడ్డుకున్న దుండగులు పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు లాక్కళ్లి రేషన్ దారంతో చేతులు.. అతని పంచెతోనే కాళ్లు కట్టేసి తువాలు మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపే శారు.
ఇంటికి వెళ్లి టమాటాలు కావాలని:అంతకు కొద్దిసేపటి క్రితమే పొలం వద్ద ఉన్న ఇంటికి వెళ్లిన ఆ అపరిచిత వ్యక్తులు టమాటాలు కావాలని.. రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నాయని ఆయన భార్య జ్యోతిని ప్రశ్నించారు. అందుకు ఆమె పాలు పోయడానికి ఊళ్లోకి వెళ్లినట్లు వారికి చెప్పారు. దీంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి కోసం దారి కాచారు.
దొంగతనం భయంతో మండీ వ్యాపారి వద్దే డబ్బులు..!:రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు టమాటాలు కోసి అంగళ్లు మార్కెట్లో అమ్మారు. డబ్బులు ఇంట్లో ఉంటే దొంగల భయం, భద్రత ఉండదని అన్ని కోతలు అయిన తర్వాత తీసుకుంటానని మండీ వ్యాపారుల వద్దే ఉంచినట్లు సమాచారం. మంగళవారం కూడా 70 క్రేట్లు(ట్రేలు) టమాటను మార్కెట్లో దించి వచ్చారు. ఆ డబ్బులు వచ్చి ఉంటాయన్న అనుమానంతోనే ఊరికి దూరంగా ఉన్న ఇతన్ని దోచుకోవడానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు (బిందు, కీర్తి) ఉన్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లు కాగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు.
ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం: భార్యభర్తలిద్దరే ఊరికి దూరంగా పొలం వద్ద నివాసం ఉంటున్నారు. భర్త ఎంత సేపటికీ రాకపోయే సరికి అనుమానం వచ్చిన భార్య జ్యోతి కుమార్తెలకు సమాచారం ఇచ్చింది. వారు ఫోన్ చేయగా ఎవరూ ఎత్తలేదు. విషయం తెలుసుకున్న రాజశేఖర్రెడ్డి సమీప బంధువు వెతుక్కుంటూ వెళ్లగా దారి మధ్యలో ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ పడి ఉండడం గమనించి చుట్టుపక్కల వెతుకగా చింత చెట్టు కింద చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న ఓ శవం కనిపించింది. వెంటేనే పోలీసులకు సమాచారం అందించగా డీఎస్సీ దేశపు సీఐ సత్యనారాయణ, ఎస్ఎస్ఐలు వెంకటేశ్, సుధాకర్ ఘటనా స్థలానికి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.