నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో.. ఆందోళనలకు ముగింపు పలికి.. చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం కోరారు. చట్టాలపై మరోమారు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
"రైతులు తమ ఉద్యమాన్ని ఆపేయాలని కోరుతున్నాను. దేశంలో చాలా మంది ఈ చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ చట్టాలలోని నిబంధనలపై ఇంకా రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే.. వినడానికి, వారితో చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైతు సంఘాలతో ఇప్పటివరకు 11సార్లు తాము చర్చలు జరిపామని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందని తెలిపారు.