అసెంబ్లీ ఎన్నికల ముందు.. బంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, భాజపా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సినీ గ్లామర్‌ను దట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ప్రధాన పార్టీలు కండువాలు కప్పగా.. ఇటీవల భాజపా కాస్త ముందడుగు వేసింది. బాలీవుడ్లో, బంగాల్ సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని చేర్చుకొని బలం పెంచుకుంది. ఇలా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో.. బంగాల్ చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) కీలకంగా మారింది.
ఇదీ చూడండి: మిథున్ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!
2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. టాలీవుడ్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. అయితే.. ఇటీవల భాజపా ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ నుంచి విశేష మద్దతు ఉన్న టీఎంసీని గద్దె దింపాలన్న లక్ష్యంతో.. పలువురు సెలబ్రిటీలను ఎన్నికల బరిలోకి దింపుతోంది భాజపా. మమత వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
టాలీవుడ్ ప్రముఖులకు భాజపా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి మరో కారణముంది. విశేష ప్రజాదరణ కలిగిన సినీ తారలను తమ వైపునకు తిప్పుకుంటే... ఔట్‌సైడర్(బయటి వ్యక్తి) అన్న ముద్రను పోగొట్టుకుని, బంగాలీల మనసులో స్థానం సంపాదించుకోవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన.
అధికార పార్టీకి ఆప్తులే..
తృణమూల్ కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో సినీ రంగంతో మంచి అనుబంధం ఉంది. బంగాలీ సినీ తారలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి(లోక్‌సభ ఎంపీ) సహా పలువురు నటులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టీఎంసీ మరికొంతమంది సినీ నటుల్ని పార్టీవైపు ఆకర్షిస్తోంది.
సినీనటులు ఓట్ల వర్షం కురిపించకపోయినా... ఓటర్లను ప్రభావితం చేయగలరని, ముఖ్యంగా గ్రామీణ, సెమీ- అర్బన్ ప్రాంతాల్లో ఈ మంత్రం పనిచేస్తుందని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి.
''మా పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఉండాలని మేం కోరుకుంటున్నాం. సినీ పరిశ్రమకు చెందినవారికి విశేష అభిమానగణం ఉంటుంది. టాలీవుడ్లో టీఎంసీ ప్రభుత్వం అరాచకం సృష్టించింది. రాష్ట్ర ప్రజలు, నటులు.. దీని నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు.''
- దిలీప్ ఘోష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
అయితే.. భాజపా ఆరోపణల్ని తృణమూల్ తిప్పికొట్టింది. 'బంగాలీ సంస్కృతిని అనుసరించేవారు ఎవ్వరూ.. బయటిపార్టీ అయిన భాజపాలో చేరరు' అని రాష్ట్ర మంత్రి అరూప్ బిశ్వాస్ అంటున్నారు.
''భాజపా, బంగాలీ సంస్కృతి.. సిద్ధాంతాలు పరస్పర విరుద్ధం. ఈ రెండూ కలిసుండే ప్రసక్తే లేదు. భాజపాలో చేరినవారు.. త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి తమ నిర్ణయం పట్ల చింతిస్తారు.''
- అరూప్ బిశ్వాస్, టీఎంసీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి
టాలీవుడ్.. అరూప్ బిశ్వాస్, ఆయన సోదరుడు స్వరూప్ గుప్పిట్లోనే ఉందని, వారి బెదిరింపులను తట్టుకోలేకే తమ పార్టీలో చేరుతున్నారని భాజపా మహిళా మోర్చా నాయకురాలు, సినీ నిర్మాత సంఘమిత్రా చౌదరి ఆరోపిస్తున్నారు.
దీనికి బదులిచ్చిన బిశ్వాస్.. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో చేసిందని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
''సుదీర్ఘంగా ఐక్యంగా ఉన్న సినీ పరిశ్రమను విడగొట్టాలని భాజపా ప్రయత్నిస్తోంది.''
- అరూప్ బిశ్వాస్, టీఎంసీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి
తృణమూల్‌లో అధికారాన్ని అనుభవించి.. ఇప్పుడు భాజపాలో చేరుతున్న వారిని అవకాశవాదులుగా అభివర్ణించారు టీఎంసీ అభ్యర్థి, సినీ నటుడు సోహమ్ చక్రవర్తి.
ఎప్పటి నుంచో అనుబంధం..
బంగాల్ రాజకీయ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. టాలీవుడ్‌తో ఎలాంటి అనుబంధం ఉందో తెలుస్తుంది. దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు.
1930ల్లో మూకీ కాలంలో బంగాల్ చిత్ర పరిశ్రమ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేది. ఎందరో నటులు.. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు. టాలీవుడ్ ఎవర్గ్రీన్ నటుడు ఉత్తమ్ కుమార్ కూడా కాంగ్రెస్‌కు విధేయుడే.
దిగ్గజ దర్శకులు రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, సత్యజిత్ రే.. నటులు ఉత్పల్ దత్తా, సౌమిత్ర ఛటర్జీ వచ్చాక టాలీవుడ్ వామపక్షాల వైపు మళ్లింది.
సినిమాతోనే సందేశం..