తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నకిలీ 'కిరాణా టోకెన్ల'తో ఓటర్లకు టోపీ! - ఓటుకు నోటు తమిళనాడు

తమిళనాడులోని కుంభకోణంలో ఓ కిరాణా కొట్టు యజమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా స్థానికులంతా టోకెన్లతో అతని దుకాణానికి రావడం మొదలుపెట్టారు. ఎందుకొస్తున్నారో తెలిసి అతనికి నోటమాట రాలేదు. ఆ తర్వాత పరిస్థితి అర్థమయ్యే సరికి నిరాశకు గురవడం స్థానికుల వంతైంది. ఇంతకీ అసలు ఏం జరిగింది?

kumbakonam grocery shop, False tokens kumbakonam
నకిలీ టోకెన్లు

By

Published : Apr 8, 2021, 3:01 PM IST

ఆ దుకాణం యజమాని ఎప్పటిలాగే షాపు తెరిచి కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో జనం తన దుకాణంవైపు పోటెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు. అందరి చేతిలో తన దుకాణం పేరుతో ఉన్న టోకెన్లు ఉన్నాయి. తమకు రెండు వేల రూపాయలు విలువ చేసే సరకులు ఉచితంగా ఇమ్మని వారు డిమాండ్​ చేసేసరికి అవాక్కయ్యాడు. ఆ టోకెన్లు అన్నీ నకీలీ అని వారికి నచ్చజెప్పినా.. జనం ఇంకా వస్తుండటం వల్ల చేసేదేమీ లేక దుకాణం మూసేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణంలో జరిగింది.

ఓటుకు టోకెన్​..

'ఇదిగోండి.. ఈ టోకెన్లు తీసుకుని ఎన్నికలు ముగిశాక ఆ దుకాణానికి వెళ్లి రూ.2000 విలువ చేసే సరకులు ఉచితంగా పొందండి. ఈ ఎన్నికల్లో మీ ఓటు మాకే' అని ఓ అభ్యర్థి చేసిన పని ఫలితమే ఈ హడావుడి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు వేల రూపాయలు విలువ గల టోకెన్లంటూ అందరికీ పంచారు. స్థానికంగా ఉన్న ప్రియం మళ్లిగై ఏజెన్సీ అనే కిరాణా షాపు పేరుతో వాటిని ముద్రించి అవి ఆ దుకాణానికి చెందినవిగా ప్రజలను నమ్మించారు. అందుకే తెలివిగా ఎన్నికలు ముగిశాక వాటిని ఆ దుకాణంలో పొందండి అని చేతులు దులిపేసుకున్నారు.

దుకాణం పేరుతో పంచిన టోకెన్​
షట్టర్​పై యజమాని అంటించిన నోటీసు

ఎన్నికల హడావుడి ముగిసింది. టోకెన్లు తీసుకున్న అందరి ఆలోచన ఆ రెండు వేలు విలువ చేసే సరకులు పొందాలనే. అందరూ ఆ దుకాణానికి బయలుదేరగా అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పటికే అక్కడికి చేరిన కొందరితో షాపు ఓనరు షేక్​ మహమ్మద్​ వాదిస్తున్నాడు. ఆ టోకెన్లు నకిలీ అని వివరిస్తున్నాడు. ఇక లాభం లేదనుకుని దుకాణం మూసేసి షట్టర్​ మీద 'ఆ టోకెన్లు అన్నీ నకిలీవి. వాటికి ఈ దుకాణానికి ఏం సంబంధం లేదు. ఎవరో ఇచ్చిన తప్పుడు హామీకి ఈ దుకాణం, నేను బాధ్యులం కాదు' అని నోటీసు అంటించి వెళ్లిపోయాడు.

ఇది ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు కొందరు చేపట్టిన చర్య అని దుకాణం యజమాని షేక్​ మహమ్మద్​ అన్నాడు. షేక్​ మహమ్మద్​ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు కావడం గమనార్హం.

ఇదీ చదవండి :జాదవ్‌పుర్‌లో కామ్రేడ్ల హవా కొనసాగేనా?

ABOUT THE AUTHOR

...view details