జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ముస్లిం ఓటు బ్యాంకే కీలకం. ఈ నేపథ్యంలో అధికారం నిలబెట్టుకునేందుకు కమలనాథులు, తిరిగి పగ్గాలు చేపట్టేందుకు అఖిలేశ్.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇరుపార్టీలు తమ సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను పదిలం చేసుకుంటూ.. వందకుపైగా స్థానాల్లో ప్రాబల్యం చూపే ముస్లిం ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఆ మేరకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.
యూపీలో ముస్లింల ప్రాబల్యం ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం జనాభా 20శాతం
- 18జిల్లాల్లోని 140కుపైగా నియోజకవర్గాల్లో పార్టీల భవితవ్యాన్ని తేల్చే సామర్థ్యం
- ముస్లిం జనాభా 20 నుంచి 30శాతం ఉన్న స్థానాలు 70
- 30శాతానికిపైగా ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలు 43
- 36 చోట్ల అభ్యర్థులను గెలిపించే సంఖ్యలో ముస్లింలు.
- రాంపూర్, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, సహారన్‌పుర్, అమ్రోహ, బిజ్నోర్, మరేలీ, సంబల్, బలరాంపూర్, బహ్రెయిచ్, హాపూర్ తదితర జిల్లాల్లో ముస్లిం జనాభా 40శాతం కంటే ఎక్కువే.
ఇంత కీలకమైన ముస్లింలు ఇంతవరకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్నారు. అయితే యూపీలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఎవరికి మద్దతిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ముస్లిం ప్రాతినిథ్యం ఇలా..
- 1991ఎన్నికల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో పెరుగుతున్న ముస్లింల ప్రాతినిథ్యం
- 1991లో 23మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.
- 1993లో 25మంది ముస్లింలు విజయం సాధించారు.
- 1996లో ఆ సంఖ్య 36కు పెరిగింది.
- 2002లో 39 మందికి ప్రాతినిధ్యం లభించింది.
- 2007లో 51 మంది ముస్లింలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
- 2012లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య అత్యధికంగా 68కి పెరిగింది.
- అయితే 2017లో భాజపా ప్రభంజనంతో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 23కు పడిపోయింది.
గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి భాజపా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1991లో 221స్థానాలతో భాజపా మొదటిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ముస్లిం ఎమ్మెల్యేలు 23మంది గెలుపొందారు.
కమలం బలం తగ్గిన ఎన్నికల్లో ముస్లింల పట్టు పెరిగింది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, 68 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అప్పుడు భాజపా కేవలం 47 చోట్ల గెలిచింది. 2017లో భాజపా 312 సీట్లు గెలిస్తే.. ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 23కు పరిమితమైంది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న కమలనాథులు.. ఈసారి ముస్లింల ప్రాతినిధ్యం పెరగకుండా ఎత్తులు వేస్తున్నారు.