శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. కొత్తగా రూపొందించిన గ్లౌజులు తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే.. చైనా సైనికుడు మూర్చపోవాల్సిందే. నయా లాఠీలు తాకితే చాలు.. డ్రాగన్ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.
గల్వాన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలో వీర సైనికుల మరణంతో.. ప్రాణహాని లేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. 1996, 2005 భారత్- చైనా ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు తుపాకులు ఉపయోగించకూడదు. అందుకే చైనా బలగాలు ఇనుప రాడ్లు, ఇనుప ముళ్ల లాంటి ఆయుధాలతో భారత బలగాలపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా.. భారత్ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్ లోయ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థకు ఈ ఆయుధాలను తయారుచేసే బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా.. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేని విధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు.
పరమ శివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా ఆయుధం తయారు చేశారు. గల్వాన్ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని.. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు.