Woman tied to lamppost beaten: ప్రేమించిన యువతితో కుమారుడు పారిపోగా.. అతని తల్లిని వీధిలోని స్తంభానికి కట్టేసి చితకబాదారు యువతి కుటుంబసభ్యులు. ఈ సంఘటన తమిళనాడు విరుధునగర్ జిల్లాలో గత మంగళవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదీ జరిగింది..
అరుపుకొట్టాయ్కి సమీపంలోని పరాలచి కే వగైకులమ్ గ్రామంలో మీనాక్షి(43) అనే మహిళ జీవిస్తోంది. ఆమె కుమారుడు శక్తి శివ(24) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సుధా అనే మహిళ కుమార్తె భువనేశ్వరి(19)ని ప్రేమించాడు శివ. అయితే.. వారి ప్రేమను ఇరువురి కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో పారిపోవాలని నిశ్చయించుకున్నారు.
చెన్నై నుంచి జనవరి 22ను స్వగ్రామానికి వచ్చిన శక్తిశివ.. భువనేశ్వరిని తీసుకుని పారిపోయాడు. మూడు రోజుల తర్వాత జనవరి 25న యువతి తల్లి సుధా, ఆమె బంధువులు మీనాక్షి ఇంటికి వచ్చారు. ఆమెను ఇంట్లోంచి లాక్కొచ్చి వీధిలోని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు.