కరుణానిధి, జయలలిత.. తమిళ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు ఇవి. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో వారిది చెరగని ముద్ర. అలాంటిది.. ఎన్నో దశాబ్దాల తర్వాత.. ఈ దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి ఎన్నికలకు వెళుతున్నాయి డీఎంకే, అన్నాడీఎంకే. వారి పేర్లను అస్త్రాలుగా మలచుకుని ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇంతకీ.. కరుణానిధి, జయలలిత ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు? ఇప్పుడు వారి స్థానాల్లో ఎవరు బరిలో దిగుతున్నారు?
కరుణానిధి..
పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపొందిన ఘనత డీఎంకే మాజీ అధినేత సొంతం. 1957లో తొలిసారి అసెంబ్లీ సీటు గెలిచిన కరుణానిధి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1984(ఆయన పోటీ చేయలేదు) మినహా.. 2016 వరకు ఎన్నికల్లో నిలిచి విజయాలను దక్కించుకున్నారు.
2011, 2016లో తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కరుణానిధి.. రెండుసార్లూ గెలిచారు. అంతకుముందు చెన్నైలోని చెపాక్-తిరువల్లికేని నుంచి మూడుసార్లు విజయాన్ని అందుకున్నారు.
ఇదీ చూడండి:-తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!
2018లో దిగ్గజ నేత మరణించారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పాండీ కలైవానన్ తిరువారూర్ నుంచి గెలిచారు. 2021 ఎన్నికల్లోనూ ఆ సీటును కలైవానన్కే అప్పగించింది పార్టీ అధిష్ఠానం.