AIADMK BJP alliance: ఫిబ్రవరి 19న జరగనున్న తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది భాజపా. అయితే, అన్నాడీఎంకేతో తమ బంధం అలాగే ఉంటుందని పేర్కొంది. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ద్రావిడ పార్టీ ముందుకు రాకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం ముందుకు వచ్చిందని, అయితే.. కాషాయ పార్టీ ఎక్కవ కోరిందని తెలిపారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నమలై. తాము పోటీ చేయాలనుకున్న స్థానాలను సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయమ్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికలపై పలు అంశాలను వెల్లడించారు అన్నమలై.
" పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, స్మార్ట్ సిటీ మిషన్ వంటి వాటితో ప్రజల్లోకి వెళ్లేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశం. ఎన్నికల్లో పోటీ చేయాలనే మా క్యాడర్ కోరికను నెలవేర్చేందుకు టికెట్లు కేటాయించనున్నాం. అందుకే 2022 అర్బన్ సివిక్ పోల్స్‌లో సొంతంగానే బరిలో నిలవాలని నిర్ణయించాం. తమిళనాడు మొత్తం అభ్యర్థలను పోటీలో దింపుతాం."