తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమత ట్విస్ట్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం.. అదే కారణం!

TMC on vice president elections: కాంగ్రెస్​ సహా ఇతర విపక్షాలకు షాక్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించింది.

TMC on vice president elections
TMC on vice president elections

By

Published : Jul 21, 2022, 6:21 PM IST

TMC on vice president elections: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్​కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించడంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణమని తెలిపింది. "ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి అయిన జగదీప్​ ధన్​ఖడ్​కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్​కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు" అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్​డీఏ అభ్యర్థిగా జగదీప్​ ధన్​ఖడ్​ పేరు ఖరారు చేసింది భాజపా. బంగాల్ గవర్నర్​గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గెరెట్​ ఆళ్వాను బరిలోకి దింపాలని కాంగ్రెస్, ఎన్​సీపీ సహా ఇతర పార్టీలు నిర్ణయించాయి.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఉన్న ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.

2024లో ప్రజాప్రభుత్వం!:మరోవైపు.. భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మమతా బెనర్జీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కోల్​కతాలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత.

"2024లో భాజపా ఓడిపోతుంది. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా ఆధిక్యం భాజపాకు రాదు. అదే జరిగితే.. ఇతర పార్టీలన్నీ కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. భాజపా బందిఖానాను, సంకెళ్లను బద్దలుకొట్టండి. 2024లో మనం ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలి." అని అన్నారు మమత. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అడ్డం పెట్టుకుని భాజపా విపక్ష నేతల్ని వేధిస్తోందని ధ్వజమెత్తారు. జీఎస్​టీ సహా వేర్వేరు అంశాల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి:కోతుల కోసం బ్రిడ్జ్ కట్టిన ప్రభుత్వం​.. ఏం ఐడియా గురూ!

చిక్కుల్లో 'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడ.. 'ఆ రికార్డులన్నీ ఫేక్- మోసం చేశారిలా!'

ABOUT THE AUTHOR

...view details