పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వెళ్లగక్కిన బంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జీ.. టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీతో ఆదివారం సమావేశమయ్యారు. టీఎంసీ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. పార్టీలో ఏదైనా అపోహలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కోల్కతాలోని ఛటర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది.
"సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి నన్ను పిలిచారు. భవిష్యత్ వ్యూహాలపై సమావేశంలో చర్చించాం. ఇలాంటి సమావేశాలు, చర్చలు ఇంకా జరుగుతాయి."
-రాజీవ్ బెనర్జీ, టీఎంసీ మంత్రి
టీఎంసీ కీలక నేత సువేందు అధికారితో కలిసి ఉన్న పోస్టర్లపై స్పందించారు రాజీవ్. ఇద్దరికీ వేర్వేరు సమస్యలు ఉన్నాయని.. వీటిని కలిపి చూడొద్దని అన్నారు. ఆ పోస్టర్లు ఎవరు అతికించారో తెలీదని, దానికి తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు.
డిసెంబర్ 5న జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీపై అసహనం వ్యక్తం చేశారు రాజీవ్. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. ఏసీలలో కూర్చొని ప్రజలను మూర్ఖులను చేయాలనుకొనే వారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వెనకడుగు వేసేది లేదని డిసెంబర్ 11న మరోసారి స్పష్టం చేశారు. బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఓవైపు భాజపా రాష్ట్రంలో పుంజుకుంటున్న వేళ.. ఈ పరిణామాలు టీఎంసీ వర్గాల్లో గుబులు రేపాయి.
సువేందు సన్నిహితుడిపై వేటు