పెగాసస్ హ్యాకింగ్ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. గందరగోళ పరిస్థితుల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మూడోరోజూ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగకుండానే రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదాపడ్డాయి.
రాజ్యసభలో..
ఒక రోజు విరామం తర్వాత పార్లమెంటు సమావేశం కాగా.. దైనిక్ భాస్కర్ పత్రిక కార్యాలయాలపై ఆదాయ పన్ను దాడులు, పెగాసస్ అంశంపై విపక్షాలు రాజ్యసభలో వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. తమ సీట్లలోకి వెళ్లాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం వల్ల.. మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి భేటీ అయిన తర్వాత హ్యాకింగ్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
'భారత ప్రజాస్వామ్యంపై బురదజల్లే కుట్ర'
రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా మరికొందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
" పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఉద్దేశపూర్వకంగానే పెగాసస్ వ్యవహారంపై వార్తలు ప్రచురితమయ్యాయి. గతంలోనూ వాట్సాప్కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారు."
- అశ్విని వైష్ణవ్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి.
మంత్రి చేతిలోంచి ప్రతులు లాక్కొని..
ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇస్తుండగా.. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ అడ్డుపడ్డారు. మంత్రి చేతిలోని ప్రతులను లాక్కొని.. చించివేసి గాల్లోకి విసిరారు. వెల్‌లోకి ప్రవేశించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాట్లాడటం ఆపేసిన మంత్రి.. తన ప్రకటన ప్రతులను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు అమర్యాదగా ప్రవర్తించటం మానుకోవాలని కోరారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు.