బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను షాక్‌కు గురిచేస్తూ ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు దినేశ్ త్రివేదీ తన ఎంపీ పదవికి సభలోనే రాజీనామా ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది తెలిపారు. ఆయన తన రాజీనామా సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
"మమతా బెనర్జీ చేతుల్లో టీఎంసీ ఎక్కువ కాలం ఉండదు. రాజకీయాలు అర్థం చేసుకోలేని కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఆ పార్టీని హస్తగతం చేసుకుంటున్నారు. పార్టీలో నేతల అభిప్రాయాలను వినేందుకు అవకాశం లేదు."
--దినేశ్ త్రివేది
నష్టమేం లేదు..
అయితే.. పార్టీలో తన ఇబ్బందుల గురించి ఇది వరకు ఎప్పుడూ సీఎం మమతా బెనర్జీతో త్రివేదీ చర్చించలేదని టీఎంసీ పేర్కొంది. ఆయన పార్టీని వీడటం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ వివేక్ గుప్తా పేర్కొన్నారు.
"రాష్ట్రంలోని హింసతో త్రివేదీ ఇబ్బంది పడుతున్నారని వినడం ఇదే మొదటి సారి. ఆయన నిజంగా హింస వల్ల బాధపడుతున్నది నిజమేనైతే.. అది భాజపా చేసిన హింసవల్లేనా? 2010 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి హింసా లేదు. బంగాలీలు మెదడుతో పోటీపడుతారు. అంతే కానీ, శారీరకంగా కాదు. దినేశ్ వ్యాఖ్యలు మమ్మల్ని షాక్‌కు గురిచేశాయి. ఆయన పార్టీనీ వీడటం వల్ల తృణమూల్‌కు వచ్చే నష్టమేమీ లేదు.
-- వివేక్ గుప్తా, టీఎంసీ అధికార ప్రతినిధి
తన రాజీనామా గురించి దీదీతో దినేశ్ చర్చించి ఉండరని వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఏదో ఓ లక్ష్యం కోసం ఆయన ఈ భావోద్వేగపరమైన నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారని అన్నారు.