తృణమూల్ కాంగ్రెస్కు పార్టీ ఫిరాయింపుల ముప్పు తప్పట్లేదు. తాజాగా మరో కీలక నేత భాజపాలో చేరారు. పార్టీ సీనియర్ నేత, పండబేశ్వర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జితేంద్ర తివారి మంగళవారం.. భాజపా కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై జితేంద్ర అసంతృప్తి వ్యక్తం చేయసాగారు.
ఎట్టకేలకు భాజపాకు..
గతేడాది డిసెంబరులో భాజపాలో చేరేందుకు మొగ్గు చూపినా, ఆ పార్టీ తిరస్కరించింది. ఎట్టకేలకు హూగ్లీ జిల్లా శ్రీరాంపుర్లో భాజపా నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో జితేంద్ర పార్టీ మారారు. దీంతో దీదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
'రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను భాజపాలో చేరాను. తృణమూల్లో ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే పరిస్థితులు లేవు' అని జితేంద్ర పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'టీఎంసీ రాజకీయాలతో దేశ భద్రతకే ముప్పు'