బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. దేశ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా సర్కార్‌కు ప్రత్యామ్నాయం.. 135ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కాదని, టీఎంసీ మాత్రమేనన్న భావన ప్రజల్లో తీసుకొచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్- మేలో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కొని అఖండ విజయం సాధించిన దీదీ.. ఇప్పుడు అదే జోరును దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. మోదీని ఎదుర్కొనే ధైర్యసాహసాలు తమకే ఉన్నాయని చెబుతున్నారు(mamata banerjee news ).
ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, అసోం, గోవాలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది టీఎంసీ. ఇటీవల బీహార్‌లోనూ హస్తం పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం భగవత్ లాల్ ఝా కుమారుడు కిర్టి ఆజాద్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా దీదీ పార్టీలో చేరారు. హరియాణా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు. తాజాగా మేఘాలయలో ప్రతిపక్ష హోదాలో ఉన్న హస్తం పార్టీ నుంచి మాజీ సీఎం ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ గూటికి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునే టీఎంసీలో చేరినట్లు సంగ్మా తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హాదాలో తాము బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నామని, దీదీ నేతృత్వంలో ముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పారు(trinamool congress meghalaya).
ఎవరూ ఊహించని ఈ రాజీకయ ఎత్తుగడతో దీదీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు(trinamool congress news ).
ఇదీ చదవండి:టీఎంసీ గురి భాజపాపై... దెబ్బలు మాత్రం కాంగ్రెస్‌కు.. ఎందుకిలా?
కాంగ్రెస్ ధ్వజం...
తమ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా స్పందించారు. కేవలం మేఘాలయలోనే కాకుండా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో హస్తం పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. టీఎంసీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వీరంతా కాంగ్రెస్ టికెట్ మీదే గెలిచారని, పార్టీ కార్యకర్తల ఓట్లే వారిని గెలిపించాయన్నారు. టీఎంసీ టికెట్‌పై గెలిస్తే వారి సామర్థ్యాలను ఒప్పుకుంటామన్నారు. కాంగ్రెస్‌ను విచ్ఛిన్నం చేసి ప్రధాని మోదీ, భాజపాకు మేలు చేయాలని టీఎంసీ కోరుకుంటోందని ఆరోపించారు(TMC congress).
మీ అసమర్థత వల్లే..
మరోవైపు కాంగ్రెస్ తమపై చేస్తున్న విమర్శలను టీఎంసీ తిప్పికొట్టింది. హస్తం పార్టీ అసమర్థత, అశక్తత కారణంగానే ఆ పార్టీ నేతలు తమవైపు చూస్తున్నారని సొంత పత్రిక 'జాగో బంగ్లా'లో వ్యాసం ప్రచురించింది(mamata banerjee latest news).
"భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు మోదీ, షా ద్వయాన్ని ఎలా ఓడించవచ్చో టీఎంసీ రుజువు చేసింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో మా పార్టీని విస్తరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. వేరే పార్టీలకు చెందిన ఎంతో మంది నాయకులు టీఎంసీలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మమతా బెనర్జీనే భాజపాకు ప్రత్యామ్నాయం అని వారంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టీఎంసీపై నిందలు మోపొద్దు."
-జాగో బంగ్లా వ్యాసం
సోనియా గాంధీ నేృతృత్వంలో ఆగస్టులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో జాయింట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని మమత సూచించారని, కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని టీఎంసీ వ్యాసంలో రాసుకొచ్చింది. ఎసీ గదులు, సామాజిక మాధ్యమాలకే కాంగ్రెస్ పరిమితమైందని దుయ్యబట్టింది. గోవా, త్రిపుర సహా ఇతర ప్రాంతాల్లో భాజపాకు వ్యతిరేకంగా రోడ్లపై పోరాటం చేస్తోంది తామేనని చెప్పింది(TMC goa). ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది(TMC news).