ప్రధాన కూడళ్లలో నేతల ఫ్లెక్సీలు
గోడలపై పార్టీల నినాదాలు
జెండాలు, కరపత్రాలు, గుర్తులు..ఇలా అసెంబ్లీ సమరం జరుగుతున్న బంగాల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. పార్టీల గుర్తులతో స్వీట్లు సైతం అందుబాటులోకి వచ్చాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రభావం ఎలా ఉందో స్పష్టమవుతోంది.
అంతటా బంగాలే!
ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో యావద్దేశాన్ని ఆకర్షిస్తోంది బంగాల్ రాజకీయమే. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. దీదీ పాలనకు చరమగీతం పాడాలని భాజపా రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమ పార్టీలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్-లెఫ్ట్ కూటములు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలా, పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బంగాల్లో ప్రచారం సైతం అత్యంత దూకుడుగా సాగుతోంది.
నిజానికి ఎన్నికల వేడి మొదలవ్వక ముందు నుంచే బంగాల్ ప్రచారంలో పోటాపోటీగా తలపడ్డాయి పార్టీలు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తొలి నుంచీ ఈ రాష్ట్రంపై అధికంగా దృష్టి పెట్టారు. టీఎంసీ సైతం అంతే దీటుగా ప్రచార పర్వంలో మునిగి తేలింది.
వ్యక్తిగత ప్రచార హోరు
ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం వల్ల పార్టీలు మరింత జోరు పెంచాయి. అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో వ్యక్తిగత ప్రచారాలు ఊపందుకున్నాయి. బంగాల్లో 294 స్థానాలు ఉండగా.. టీఎంసీ 291 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. లెఫ్ట్ కూటమి 39 మంది నామినీలను ఖరారు చేసింది. దీంతో నేతలంతా ప్రచారంలోనే మునిగి తేలుతున్నారు.
ఇంటింటి ప్రచారం
అశోకేనగర్ టీఎంసీ అభ్యర్థి ధిమన్ రాయ్ ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. శనివారం ఉదయం నుంచి తన నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తున్నారు. జాదవ్‌పుర్ అభ్యర్థి దేబబ్రత మజుందర్ సైతం ఓటర్లను కలుస్తున్నారు.
సీపీఎం పార్టీ ఝాడ్‌గ్రామ్ నామినీ మధుజా సేన్ రాయ్ సైతం తన నియోజకవర్గంలో క్యాంపెయిన్‌ను ఆరంభించారు.
భార్య, భర్త.. ఓ నియోజకవర్గం!
బెహాలా ప్రాంతంలో టీఎంసీ మద్దతు దారులు గోడలపై గ్రాఫిటీతో పేయింటింగ్లు వేశారు. బెహాలా పశ్చిమ, తూర్పు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న పార్థా చటర్జీ, రత్నా చటర్జీలకు మద్దతుగా నినాదాలు రాశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు తూర్పు బెహాలా వేదిక కానుంది. తన భర్త, భాజపా నేత సోవన్ చటర్జీ నుంచి విడిపోయిన రత్న.. ఈ స్థానం నుంచి ఆయనపైనే పోటీకి దిగుతున్నారు. తూర్పు బెహాలాకు 2011 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు సోవన్.