TMC Leader Arrested In Delhi : జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కోసం దిల్లీలోని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం (కృషి భవన్) వద్ద తృణముల్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఆందోళనల్లో టీఎంసీ ఎంపీలు, మహిళా నాయకుల పట్ల దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీమండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అని ఆయన అన్నారు. దీనికి నిరసనగా ఆక్టోబర్ 5న కోల్‌కతాలోని 'రాజ్‌భవన్ అభియాన్' వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. లక్ష మందితో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
"గిరిజన మహిళా నాయకుల పట్ల పోలీసుల తీరు దుర్మార్గం. దీనికి నిరసనగా అక్టోబర్ 5న లక్ష మందితో కోల్‌కతాలోని రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం. అలాగే గవర్నర్‌ను కలిసి.. 50 వేల వినతి పత్రాలను ఆయనకు అందజేస్తాం. రానున్న ఆరు నెలల్లో దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు సరైన బుద్ధి చెబుతారు" అని అభిషేక్ అన్నారు.
అంతకుముందు.. కేంద్ర మంత్రిని కలిసేంత వరకు ధర్నా చేపడతామని తృణముల్ నేతలు చెప్పడం వల్ల పోలీసులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో సహా పలువురి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూడు గంటల తర్వాత వారిని విడిచిపెట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ టీఎంసీ నేతలు రెండు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు.