Tirumala Srivari Brahmotsavam Arrangements: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీవారి పెద్దశేష వాహన సేవ అనంతరం.. ఇతర వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు కనువిందు చేసేలా.. తిరుమలలో ఫల పుష్ప ప్రదర్శనశాలను తితిదే ఏర్పాటు చేసింది.
భావితరాలకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను తెలియచేసి.. ఆధ్యాత్మికతను పేపొందించేలా వీటిని రూపొందించింది. మరోవైపు ఇవాళ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి తరఫున విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Tirumala Brahmotsavalu Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏయే రోజుల్లో ఏయే వాహన సేవంటే..
పండితుల వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు ఆస్థానాలను, ఇతర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో అంకురార్పణకు క్రతువును నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందుతూ.. నవధాన్యాలను మొలకెత్తించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభోపేతంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.