Tiranga bike rally: కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం 'తిరంగా బైక్ ర్యాలీ' నిర్వహించనుంది. ఎర్రకోట నుంచి పార్లమెంట్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా పలు కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తోంది. దిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పలు విషయాలను వెల్లడించారు. తిరంగా బైక్ ర్యాలీ.. పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొనాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. అలాగే పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పలు కార్యక్రమాలు చేయాలని సూచించారు.
''భాజపా కార్యకర్తలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా ఉన్న యువ కార్యకర్తలు 'తిరంగా బైక్ ర్యాలీ'లో పాల్గొనాలి. అలాగే ఆగస్టు 11 నుంచి 13 వరకు మహాత్మా గాంధీకి ఇష్టమైన 'రఘుపతి రాఘవ రాజారామ్', 'వందేమాతరం' గీతాల్ని ఆలపించాలి.''