జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah News) తెలిపారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. మూడు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో(Amit Shah Kashmir Visit) భాగంగా.. భగవతీ నగర్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
"జమ్మూ ప్రజలకు జరిగిన అన్యాయం ముగిసిపోయిందని చెప్పేందుకు నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీకు ఎవరూ అన్యాయం చేయలేరు. కొంతమంది ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఎవరూ దీన్ని అడ్డుకోలేరని నేను మీకు భరోసా ఇస్తున్నాను."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో యువత భాగమైతే.. ఉగ్రవాదుల వ్యూహం దెబ్బతింటుందని చెప్పారు.