Time 100 Next List Indians : '2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింద్ ది వరల్డ్ ' పేరుతో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సహా ముగ్గురు భారతీయులు స్థానం సంపాదించారు. ఇందులో కౌర్‌తో పాటు నందిత వెంకటేశన్, విను డానియెల్ ఉన్నారు. ఇక భారత సంతతి నబారున్దాస్ గుప్తాకు కూటా ఈ లిస్ట్‌లో చోటు దక్కింది.
'అందులో కౌర్‌ది కీలక పాత్ర'
మహిళల క్రికెట్‌ను ఆదరణ లేని క్రీడ నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన క్రీడల్లో ఒకటిగా మార్చడంలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్, నైపుణ్యం కీలక పాత్ర పోషించాయని టైమ్ మ్యాగజైన్ కొనియాడింది. 2017లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కౌర్ 115 బంతుల్లో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిందని పేర్కొంది. ఆమె అసాధారణ ప్రతిభను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారని చెప్పింది. అంపైర్లను విమర్శించినందుకు కౌర్ రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉందని.. మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా కట్టిందని గుర్తుచేసింది. అయితే, ఆమె ఇప్పటికే వార్తల్లో నిలుస్తోందని టైమ్ మ్యాగజైన్ తమ నివేదికలో పేర్కొంది.
'ఆధిపత్యంపై నందిత వెంకటేశన్ విజయం'
నందిత వెంకటేశన్.. క్షయ వ్యాధి నుంచి బయటపడిన వ్యక్తి. చికిత్స సమయంలో తాను తీసుకున్న ఔషధాల వల్ల ఆమె వినికిడిని కోల్పోయింది. అయితే ఈ వ్యాధికి ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సురక్షితమైన ఔషధాన్ని తయారు చేసింది. కానీ కఠినమైన పేటెంట్ చట్టాల వల్ల.. ఆ మందు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో లేదు. ఈ క్రమంలో గతేడాది జులైలో జాన్సన్ అండ్ జాన్సన్ పేటెంట్ సమయం అయిపోయింది. దీంతో మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మళ్లీ తమకే పెటెంట్ హక్కులు కల్పించాలని ఆ సంస్థ దరఖాస్తు పెట్టుకుంది.
అయితే, ఈ మందు అందరికీ చేరువ చేయాలనే సంకల్పంతో తన లాగే వినికిడి కోల్పోయిన దక్షిణాఫ్రికా మహిళ టిసిలేతో జట్టుకట్టింది. వీరిద్దరూ మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటి రెస్ (Médecins Sans Frontières) స్వచ్ఛంద సంస్థతో కలిసి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి పేటెంట్ హక్కులు మళ్లీ కల్పించొద్దని భారత ప్రభుత్వానికి, దక్షిణాఫ్రికాలో పిటిషన్లు వేశారు. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ కంపెనీకి రెండోసారి పేటెంట్ ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఫలితంగా చౌక ధరలో జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇక, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా తక్కువ ధరలో జనరిక్ మందులు తయారుచేసేందుకు ముందుకొచ్చింది. అయితే 'మాకు జరగాల్సిందేదో మాకు జరిగింది.. కానీ ఇతరులకు ఇలా జరగకుండా మనం నిరోధించవచ్చు' అని నందిత వెంకటేశన్ చెప్పారు. ఈ మేరకు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.