100 శాతం వ్యాక్సినేషనే లక్ష్యంగా బిహార్లోని ముజఫర్పుర్ జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరద ప్రాంతాల్లో ప్రత్యేక పద్ధతిలో టీకా పంపిణీ చేపడుతున్నారు. జిల్లాలోని కత్రా బ్లాకులో పడవల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వరద ప్రాంతాలకు వైద్య సిబ్బంది ఈ పడవల ద్వారా వెళ్లి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. స్థానిక సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ శర్మ ఈ టీకా పడవలను ఆవిష్కరించారు.
"జిల్లా మేజిస్ట్రేట్ ఆలోచన మేరకు పడవల్లో టీకా కేంద్రాలను ఆవిష్కరించాం. వరద ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో తొలిసారి ఇలా విభిన్న పద్ధతిలో టీకా పంపిణీ చేపడుతున్నాం. ఇద్దరు నర్సులు, ఇద్దరు నిపుణులైన నావికులు పడవలో ఉంటారు."