స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ.. పంజాబ్‌లో బాంబు కనిపించడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఓ గ్రామంలో టిఫిన్ బాక్సులో అమర్చిన రెండు కిలోలకు పైగా బరువున్న ఆర్డీఎక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి దీన్ని డ్రోన్ సాయంతో జారవిడిచారని అనుమానిస్తున్నారు.
టిఫిన్ బాంబు ఉన్న బ్యాగులో మరిన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా తెలిపారు. ఆదివారం వీటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
"టిఫిన్ బాక్సులో అమర్చిన ఐఈడీ సహా గ్రెనేడ్లు, తూటాలను ఆదివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నాం. అమృత్‌సర్‌కు సమీపంలోని ధాల్కీ గ్రామంలో ఇవి లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి దీన్ని డ్రోన్ ద్వారా జారవేశారని మేము అంచనా వేస్తున్నాం. తమ గ్రామంలో డ్రోన్లు తిరుగుతున్నాయని ఆ ఊరి మాజీ సర్పంచ్ ఒకరు పోలీసులకు తెలియజేశారు."
-దిన్కర్ గుప్తా, పంజాబ్ డీజీపీ
ఏడు పౌచులు ఉన్న బ్యాగులో ఓ ప్లాస్టిక్ టిఫిన్, ఐదు గ్రెనేడ్లు, 100 రౌండ్ల 9 ఎంఎం తూటాలు, రెండు కిలోల పేలుడు వస్తువు, ఓ రిమోట్ కంట్రోల్ స్విచ్‌ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ దిన్కర్ గుప్తా తెలిపారు. ఈ కేసులో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) సాయాన్ని తాము తీసుకున్నామని చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్ఎస్జీ బృందం.. ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిందని వెల్లడించారు.