రైల్లో గుండెపోటుకు గురైన యువతిని చాకచక్యంగా కాపాడారు టికెట్ కలెక్టర్లు. ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేస్తున్న సమయంలో 19ఏళ్ల యువతి ఇబ్బందులు పడటాన్ని గమనించి.. వెంటనే సహాయం చేశారు. వాయువేగంతో ఆస్పత్రికి తరలించడంలో సహకరించి యువతి ప్రాణాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు.
19 ఏళ్ల యువతికి రైల్లో గుండెపోటు.. మహిళా టికెట్ కలెక్టర్ల చొరవతో ప్రాణాలు సేఫ్
రైలులో ఓ యువతికి గుండెపోటు వచ్చింది. రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఆ యువతి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ముంబయిలోని కల్యాణ్‌కు వెళ్లాల్సిన రైలు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లో ఆగి ఉంది. అందులో 19ఏళ్ల యువతి ప్రయాణిస్తోంది. యువతికి ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చింది. వెంటనే చేతులు, కాళ్లు వణకడం ప్రారంభమైంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. రైల్లో తనిఖీలు నిర్వహిస్తున్న టికెట్ కలెక్టర్లు దీపా వైద్య, జైన్ మార్సిలా.. ఆమె పరిస్థితిని గమనించి.. వెంటనే దగ్గరకు వెళ్లారు. యువతికి గుండెపోటు వచ్చిందని గ్రహించి.. రైల్వే స్టేషన్ నుంచి వీల్ఛైర్లు తెప్పించారు. స్టేషన్‌లోని అత్యవసర మెడికల్ సెంటర్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రిలోకి తరలించారు. యువతిని ఆస్పత్రిలో చేర్పించే వరకు టికెట్ కలెక్టర్లు దగ్గరుండి ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి.. వారికి సమాచారం అందించారు. ఆమె బంధువులు వెంటనే అక్కడికి చేరుకున్నారని టికెట్ కలెక్టర్ దీపా వైద్య పేర్కొన్నారు.
"మా రైల్వే ఉద్యోగులు మానవీయ దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారు. తమ విధినిర్వహణతో పాటు ప్రయాణికులకు అవసరమయ్యే అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రయాణికులను కాపాడటంలో రైల్వే పోలీసులు, ఉద్యోగులు ముందుంటున్నారు" అని సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఏకే సింగ్ తెలిపారు.