ఉదయ్‌పుర్-అహ్మదాబాద్ మధ్య కొత్తగా ప్రారంభమైన రైల్వే లైన్‌లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రైల్వేట్రాక్‌ను పేల్చేయడంతో పట్టాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు రైళ్ల రాకపోకల్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి కొన్ని గంటల ముందు రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించడంతో ట్రాక్‌లకు పగుళ్లు ఏర్పడ్డాయి.
దీంతో ఆ మార్గంలో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును దుంగార్‌పూర్‌లో నిలిపివేసినట్టు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ పేలుడుకు డిటోనేటర్లు వాడినట్టు సమాచారం.ఈ ఘటనపై ఉదయ్‌పూర్ ఎస్సీ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈ విధ్వంసంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్టు చెప్పారు. జవార్ మైన్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేవాడ కీ నాల్ సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుందన్నారు.
పట్టాలను పరిశీలిస్తున్న ఆధికారులు పేలుడు సంభవించినట్టు ఈ ఉదయం స్థానికులు తమకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్‌లపై కొన్ని పేలుడు పదార్థాలను గుర్తించినట్టు జవార్ మైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనిల్ కుమార్ వైష్ణోయ్ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రైల్వే లైన్‌లో అక్టోబర్ 31న అహ్మదాబాద్‌లోని అసర్వా రైల్వే స్టేషన్ నుంచి అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. "ఎన్ఐఏతో పాటు మరికొన్ని దర్యాప్తు సంస్థలు ఉదయ్‌పుర్ ట్రాక్ పేలుళ్లపై విచారణ చేస్తున్నాయి. ఘటనపై ప్రాథమిక విచారణ 3 నుంచి 4 గంటల్లో పూర్తవుతుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. వీలైనంతా తొందరగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తాం." అని ఆయన అన్నారు.